వన్డే వరల్డ్ కప్ కు ముందు టీమిండియాను వరుస ఓటములు వేధిస్తున్నాయి. దీంతో భారత అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. వెస్టిండీస్ గడ్డపై ఆ దేశ జట్టుతో తలపడుతున్న టీమిండియా పరాజయాల పరంపర కొనసాగిస్తున్నది. వరుసగా రెండో టీ20 లోనూ ఓటమి చవి చూసింది. ఇదే ఇప్పుడు అభిమానుల నిరాశకు కారణమైంది. వన్డే వరల్డ్ కప్ నాటికి దీటైన జట్టుగా సిద్ధమవుతుందని భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఓటములతో మరింత నిరాశను కలిగిస్తున్నది.
రెండో టీ 20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. జట్టులో ఆటగాడు తెలుగు బిడ్డ తిలక్ కర్మ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా మిగతా కెప్టెన్ తో సహా అందరూ విఫలమయ్యారు. ఇక లక్ష్యసాధనలో భాగంగా వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసింది. అందులో నికోలస్ పూరన్ 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఇక భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీయగా, యజేంద్రా చాహాల్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షరదీప్ సింగ్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.
అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలే టీమిండియా ఓటమికి కారణంగా కనిపిస్తున్నాయి. పవర్ ప్లేలో రవి బిష్ణోయ్ కి బౌలింగ్ ఇవ్వడం, చాహాల్ కు పూర్తి కోటా ఇవ్వకపోవడం కూడా ఓటమికి కారణంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా 18 వ ఓవర్లో చాహాల్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. పలువురు క్రీడా విశ్లేషకులు కూడా పాండ్యా తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. ప్రయోగాలకు పోయి ఇలా పరువు తీసుకోవడం ఎందుకని పలువురు మండిపడుతున్నారు.
అయితే మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వరుస ఓటములు టీమిండియా అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. జట్టులో ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాల్సిన సమయంలో ఇలా ఒక్కొక్కరూ పెవిలియన్ చేరుతూ విఫలమవడం అభిమానుల్లో నిరాశ నింపుతున్నది. ప్రపంచ కప్ నాటికి పవర్ ఫుల్ జట్టుగా రంగంలోకి దిగుతారనుకున్న సమయంలో యువ ఆటగాళ్లు ఇలా విఫలమవడం జట్టు పై పెట్టుకున్న ఆశలను నీరు గారుస్తున్నది.