
Malli karjuna Kharge : ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. బజరంగ్ దళ్ వివాదంలో ఆయనపై దాఖలైన రూ. 100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫేస్టోలోని అంశమే ఇందుకు కారణమైందని తెలుస్తోంది.
అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ సంస్థలపై నిషేదం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై హిందూ సంఘం నేత ఒకరు పరువునష్టం దావా వేశారు. దీనికి సంబంధించి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ విషయంపై ఎన్నికల సమయంలో విమర్శలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తన మాటలను వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత బజరంగ్ దళ్ ను నిషేదించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.
ఇటీవల కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక విజయాన్ని కైవసం చేసుకుంది. 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 135 చోట్ల హస్తం జెండా పాతింది. ఇక బీజేపీ 66 సీట్లతో రెండో స్థానానికి పరిమితమవగా.. స్థానిక పార్టీ జేడీఎస్ 19 చోట్ల విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. మేనిఫెస్టోలో పెట్టినా.. ప్రసంగాల ద్వారా వెల్లడించినా తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే బజరంగ్ దళ్ పై నిషేదం విధిస్తే హిందూ సమాజం ఓట్లు పడవని భావించి వెనుకకు తీసుకున్నట్లు అనేక వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా బజరంగ్ దళ్ ను విమర్శించినందుకే ఈ సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది.