సినీనటుడు పృథ్వీరాజ్ హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడే. థర్టీ ఇయర్స్ ఇండస్ర్టీ అంటూ తనదైన శైలిలో హాస్యం పండించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉన్న పాత్రను కూడా పోషించిన పృథ్వీ వార్తల్లో నిలిచాడు. తనదైన శైలిలో హాస్యం పండిస్తూ సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు. నాటి నటుడు రాంగోపాల్ వర్మ మేనల్లుడిగా సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసి, ఇప్పటివరకు 75కు పైగా సినిమాల్లో నటించారు.
పృథ్వీరాజ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి , ఆయన వెంట పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ చానల్ చైర్మన్ అయ్యారు. ఓ మహిళతో చేసిన చిలిపి చేష్టల కారణంగా అధిష్టానం ఆయనను పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో ఇది సంచలనంగా మారింది. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులపై కామెంట్లు చేస్తున్నా, పెద్దగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయితే తాజాగా నాటి అంశంలో జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు.
ఈ సంఘటన జరిగినప్పుడు తనను సీఎం జగన్ పిలిపించి మాట్లాడలేదన్నారు. ఈ విషయంలో పిలిపించి మాట్లాడి తప్పెవరిదో తెలుసుకుంటే బాగుండేదన్నారు. అయితే ఈవిషయంలో జగన్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన కోటరీ వల్లే ఇదంతా జరిగిందన్నారు. 68 మంది సలహాదారులును పెట్టుకొని ఆయన ఎవరినీ దగ్గరకు రానీయడం లేదని మండిపడ్డారు. అయితే తన పేరు పృథ్వీరాజ్ రెడ్డి అని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అయితే తన విషయంలో కొంత వైసీపీ పార్టీ నేతల వల్లే ఇబ్బంది కలిగిందని చెప్పుకొచ్చారు. దీంతో నాటి నుంచి వైసీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలిన స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. దీనిపై వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదురైనా ఆయన దీటుగా బదులిస్తూ వస్తున్నారు.