
Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ఇటీవల ఐపీఎల్ కు సైతం రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత నెల 11న సీఎం జగన్ ను కలిసి అంబటి రాయుడు నేడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. మధ్యాహ్న సమయంలో వీరి భేటి జరుగగా దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి.
ఇటీవల పలుమార్లు సీఎంను అంబటి రాయుడు కలుస్తుండటంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ను ఆయన అడిగినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు జనసేనలో చేరుతారని గతంలో ప్రచారం జరిగినా ఆయన మాత్రం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది.






