
Anam meet Chandrababu : ఏపీలో ని నెల్లూరు జిల్లాలో కీలక నేత టీడీపీలోకి చేరబోతున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ రెబెల్ గా ఉన్న ఆయన ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన నిర్ణయం చెప్పినట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఆనం ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపి నుంచి బెర్త్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయన తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సీటుపై చర్చించారు. తాజాగా శనివారం తన అనుచరులతో సమావేశమై తన నిర్ణయం ప్రకటించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొంతకాలంగా సొంత పార్టీ, సీఎం జగన్ పై అసంతృప్తిగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని నియమించడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణలతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆయనే టీడీపిలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాదులో చంద్రబాబును కలిసి గంటకు పైగా చర్చలు జరిపారు.
జిల్లాలో రాజకీయ సమీకరణాలు, పోటీ తదితర అంశాలపై మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ఆనంను వెంకటగిరి నుంచి కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ నుంచి పోటీకి దించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు నుంచి గతంలోనూ పోటీ చేసిన అనుభవం ఆనంకు ఉంది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీలో ఉండే అవకాశం ఉన్నా ఆనం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
లేదంటే ఎంపీగా ఆనంను బరిలో కి దింపుతారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఆనం కూతురు కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆమె ఆత్మకూరు సీటును ఆశిస్తున్నారు. అయితే ఇద్దరిలో ఎవరో ఒకరికి సీటు దక్కే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఒకరికి ఎంపీ, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని టాక్ నడుస్తున్నది
మరో వైపు లోకేష్ పర్యటన కడప జిల్లాలో పూర్తి కాపోతున్నది. అయితే నెల్లూరు జిల్లాకు లోకేష్ పాదయాత్ర కు ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు ఆనం వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపిలో పట్టు పెంచుకునేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో టీడీపీలో అధికారికంగా చేరడంపై నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నేతలు, అనుచరుల సమావేశంలో ఆయనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. అందుకు వారు సమర్థించారు కూడా.
అయితే నెల్లూరు జిల్లాలో చేరికల నేపథ్యంలో టీడీపీ మరింత బలోపేతం అవుతున్నదని వార్త వినిపిస్తున్నది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో టీడీపీ కి బలం పెరిగింది. మరోవైపు నెల్లూరులో కూడా టీడీపీ పట్టు నిలుపుకుంటున్నది. మరి రానున్న రోజుల్లో ఇది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చే అవకాశం కనిపిస్తున్నది.






