
Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ విచారణకు పిలిచినా హాజరుకాకుండా సంచలనంగా మారారు. అయితే ప్రస్తుతం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇదే కేసులో జైలులో ఉన్నారు. కాగా, అవినాష్ రెడ్డి తల్లి గుండె సంబంధిత ఇబ్బందులతో దవాఖానలో చేరగా అప్పటి నుంచి ఆమె ఉంటే ఉన్నారు. కర్నూల్ లోని విశ్వ భారతి దవాఖానలో ఆమెకు వారం రోజులుగా చికిత్స అందుతున్నది.
అయితే తాజాగా ఆమె ఆరోగ్యం కుదుట పడిందని, ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తల్లికి అనారోగ్యం కారణంగ తాను విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు అవినాష్ రెడ్డి ఇన్నాళ్లూ సీబీఐకి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం తన తల్లితో పాటే ఆయన కూడా హైదరాబాద్ కు బయల్దేరినట్లు తెలిసింది.
అయితే మరికాసేపట్లో ఆమెను కర్నూల్ నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు. అక్కడ కూడా ఓ దవాఖానలో చేర్పించి, ఆమెకు మరికొంత కాలం చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అయితే గురువారమే విచారణ తేదీ ఉండగా, హైకోర్టుకు ఈరోజుకు వాయిదా వేసింది.
హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఈరోజు విచారణ అనంతరం తీర్పు ప్రకటించనుంది. అయితే తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, తీర్పు అనుకూలంగా రాకపోతే ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పటికే వైసీపీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిస్తే అవినాష్ రెడ్డిని వెంటనే సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ రానుంది.