Exit polls: పోలింగ్ ముగిశాక హర్యానా, జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. హరియాణాలో బీజేపీ అధికారం కోల్పోవడంతో పాటు జమ్ము-కశ్మీర్ లోనూ గడ్డు పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుంది. హర్యానాలో మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్ 49-55 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 18-32 సీట్లకే పరిమితమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 5న హర్యానాలో 67 శాతం పోలింగ్ నమోదైంది.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే హర్యానాలో బీజేపీ పదేళ్ల పాలనకు ఇక తెరపడినట్లు అవుతుందని జోస్యం చెప్తున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించింది. మరోవైపు జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 1, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2018 నుంచి రాష్ట్రం కేంద్రం పాలనలో ఉన్న విషయం తెలిసిందే.
జమ్ము-కశ్మీర్ లో 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46 సీట్ల మెజారిటీ మార్కుకు పడిపోవడం వల్ల హంగ్ ఏర్పడి ఉండవచ్చని పలు ఎగ్జిట్ పోల్ రిపోర్టులు వెల్లడించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము-కశ్మీర్ లో అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉండొచ్చని సూచిస్తున్నాయి.