
Avinash Arrest : కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాష్ ను ఇప్పటికే పలు మార్లు విచారించింది. అయితే ఇటీవల విచారణకు పిలిచిన మూడు సార్లు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిని సీబీఐ సీరియస్ గా తీసుకుంది. సీబీఐ కేంద్ర కార్యాలయం కూడా వెంటనే అవినాష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
అవినాష్ రెడ్డి తల్లి గుండె సంబంధిత ఇబ్బందితో దవాఖానలో చేరింది. అయితే తల్లిని కడప నుంచి కర్నూల్ కు తరలించడం కొన్ని అనుమాలకు తావిచ్చింది. అయితే పరిస్థితి విషమంగా ఉంటే, అటు హైదరాబాద్.. ఇటు బెంగళూరుకు కాకుండా కర్నూల్ లోని తనకు తెలిసిన దవాఖానలో ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా సీబీఐ అధికారులు రహస్యంగా ఆరా తీసినట్లు సమాచారం. దీంతో వెంటనే హైదరాబాద్ నుంచి కర్నూల్ చేరుకున్న సీబీఐ బృందాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఏ క్షణమైనా అవినాష్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించాలని సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది.
అయితే ఇప్పటికే అవినాష్ అరెస్ట్ కు సంబంధించి సమాచారం కర్నూల్ ఎస్పీకి సీబీఐ అందజేసింది. అరెస్ట్కు ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు అవినాష్ బెయిల్ అంశం గురువారం హైకోర్టులో చర్చకు రానుంది. దీంతో హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డి అనుచరులు. వైసీపీ శ్రేణులు కూడా ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. అవినాష్ రెడ్డి పరిణామాలు ఎలా ఉంటాయోనని వైసీపీ అధిష్టానం అంచనా వేసుకుంటున్నది. మరోవైపు నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.