Chandrababu Bail Petitions : టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ ఈనెల 9న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ఈనెల 10న హాజరపర్చింది. అయితే ఈ సందర్భంగా ఆయనకు 12రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు..
అయితే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు ఏపీ హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటిషన్లను చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు. వీటిపైన ఈ రోజు ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేయనుంది. అయితే ఈ పిటిషన్లపై కోర్టు నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ తెలుగు రాష్ర్టాల్లో రేపుతున్నది. చంద్రబాబుకు ఇందులో ప్రమేయం లేదని, ఇది కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబుపై ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్ కోసం ప్రయత్నిస్తున్నదనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై సీఐడీ కౌంటర్ దాఖలు చేయబోతున్నది.
అయితే ఇటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. చంద్రబాబు కు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం ఈ రోజు విచారించనుంది. అయితే చంద్రబాబును కస్టడీ కి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇక కౌంటర్ పిటిషన్ల దాఖలు అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.