Chandrababu CID custody : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థనతో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి సీఐడీ కోర్టు అనుమతించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు ఇదివరకే రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటే సీఐడీ కోరగా న్యాయమూర్తి రెండురోజుల విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజమహేంద్రవరం జైలులోనే ఆయన విచారణ కొనసాగాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. కోర్టు వారి వాదనలే పరిగణనలోకి తీసుకుంది. దీంతో బాబు మరో రెండు రోజులు జైలులోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పిటిషన్లు వేసినా వాటిపై సానుకూల ఫలితాలు రాలేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు విడుదల కోసం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలో ఉంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పని కాకపోతే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని చూస్తున్నారు. మరోవైపు లోకేష్ ను అరెస్టు చేస్తారనే వార్తలు వస్తుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. వైసీపీ నేతల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
కుట్రపూరితంగా వైసీపీ దొంగ ఆధారాలు తీసుకొచ్చి బాబును జైలుకు పంపిందని లోకేష్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా అందరి మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని సీఐడీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాబును జైల్లోనే ఉంచే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాబు విషయంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.