Chandrababu Remand : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో రెండు రోజుల రిమాండ్ ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియనుండగా, తాజాగా మరో రెండు రోజులు పొడిగించింది. అయితే ముందుగా ఏసీబీ న్యాయమూర్తి, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును వర్చువల్ విధానంలో విచారించారు. ఈనెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
రిమాండ్ లో ఏమైనా సమస్యలు వచ్చాయా అంటూ చంద్రబాబును న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను ఏ తప్పు చేయలేదని, అకారణంగా ఇందులో ఇరికించారని, జైల్లో పెట్టారనే బాధ ఉందని చెప్పారు. అయితే చంద్రబాబు చెప్పిన అంశాలన్నీ న్యాయమూర్తి నోట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే న్యాయమూర్తి స్పందిస్తూ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. రిమాండ్ ను శిక్షగా భావించవద్దు.. ఇది చట్ట ప్రకారం జరుగుతున్నది. చట్టం అందరికీ సమానమేనంటూ చెప్పుకొచ్చారు.
అయితే చంద్రబాబు రిమాండ్ అంశంపై వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1.30కు విచారణకు వచ్చే అవకాశమున్నది. ఒకవేళ రిమాండ్ ని హైకోర్టు కొట్టివేస్తే, అప్పుడు కస్టడీలోకి తీసుకోవడం కుదరదు. దీంతో కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా వేయాల్సి వస్తున్నదని సమాచారం. ఈ కారణంతోనే శుక్రవారం 2.30 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఏసీబీ న్యాయస్థానం వెల్లడించింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుకు అనకూలంగానే కస్టడీ పిటిషన్ పై ఏసీబీ న్యాయస్థానం తీర్పు ఉండబోతున్నది.