Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో చంద్రబాబును ఆన్ లైన్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా.. అక్లోబర్ 5 వరకూ పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు కస్టడీ ముగియగానే సీఐడీ రాజమండ్రి జైలు నుంచే వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జి కీలక ప్రశ్నలను చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.
‘సీఐడీ విచారణలో అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా?’ అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బదులిచ్చిన చంద్రబాబు.. ‘విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని’ జడ్జికి సమాధానమిచ్చారు. విచారణ అనంతరం చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.