CID Interrogated Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారణ చేస్తున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారులు రాజమండ్రి చేరుకున్నారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఏఎస్సై, కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్, ఇద్దరి అఫీషియల్ మధ్యవర్తులు ఉన్నారు. దీంతో బాబుకు మొదట వైద్య పరీక్షలు చేశారు.
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు తో పాటు అధికారులు చంద్రబాబును పలు ప్రశ్నలు వేసేందుకు అనుమతించారు. శని, ఆదివారాల్లో అధికారులు బాబును ప్రశ్నించనున్నారు. రెండు రోజులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు.
చంద్రబాబును కస్టడీకి తీసుకోవడానికి ముందు తీసుకున్న తరువాత వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం విచారణను వీడియో రికార్డు చేశారు. సీఐడీకి చెందిన వారితోనే ఈ ప్రక్రియ చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను కోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీడియోలు, ఫొటోలు బయటకు రావొద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
విచారణ సమయలో గంటకోసారి ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తారు. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇస్తారు. విచారణ సమయలో వైద్య సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఆదివారం సాయంత్రం కస్టడీ గడువు ముగిసిన తరువాత వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కోర్టు ఎదుట హాజరు పరచాలని తెలిపారు. ఈ కేసులో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరినా రెండు రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది.