Kamala Harris:బైడెన్ ఎన్నికల రేసులో ఉంటే.. ట్రంప్ 400 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకునేవారని శ్వేత సౌధం అంతర్గత సర్వేల్లో తేలిందట. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు ఒబామాకు గతంలో స్పీచ్ రైటర్‌గా పనిచేసిన జాన్ ఫ్రావూ వివరించారు. ప్రస్తుతం ఆయన ‘సేవ్ అమెరికా’ పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. బైడెన్ ఎన్నికల రేసులో నిలబడి పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు.
‘బైడెన్ రేసు నుంచి వైదొలగి.. పగ్గాలు కమల చేతికి ఇచ్చినప్పుడే మాకు ఒక విషయం అర్థమైంది. అంతర్గత సర్వే నివేదికల ప్రకారం.. ట్రంప్ 400 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోనున్నట్లు సన్వే సర్వే వెల్లడించింది. అసలు బైడెన్ రేసులో ఉండడం ఘోరమైన నిర్ణయం. డెమోక్రట్లకు నష్టం జరిగే వరకూ ఈ విషయాన్ని అంగీకరించలేదు. పైగా.. నా పాలన చరిత్రాత్మకం, అమెరికా ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. అధ్యక్షుడి బృందం కమలకు వెన్నుపోటు పొడిచింది. ఆమె గెలువలేదని విలేకరులకు లీకులు ఇచ్చింది’ అని జాన్ ఫ్రావూ పేర్కొన్నారు.
బైడెన్‌ను తప్పుపట్టిన నాన్సీ పెలోసీ..
ఫలితాలు వెలువడ్డ తర్వాత బైడెన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ పెలోసీ బైడెన్‌ను తప్పుపట్టారు. ఆమె న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘అధ్యక్షుడు తొందరగా వైదొలగి ఉండాలి. అప్పటికే రేసులో ఇతర అభ్యర్థులు ఉండేవారు. అప్పుడు ఓపెన్ ప్రైమరీలు జరిగేవి. కమల పేరును బైడెన్ నామినేట్ చేసే సమయంకు ప్రైమరీలు నిర్వహించే సమయం లేదు. ముందుగా జరిగి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కమల పోరాటం ఎంతో మందిలో ఆశలను పెంచాయి’ అని పేర్కొన్నారు. ట్రంప్ రీసెంట్ గా ఆరిజోనా, నెవడాలో విజయం సాధించడంతో ఆయన మెజార్టీ 312కు చేరుకుంది. స్వింగ్ స్టేట్స్ మొత్తం ఆయనకు పట్టం కట్టాయి.