
private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. టోల్ చార్జీల భారం తగ్గించేందుకు ఏడాది పాటు చెల్లుబాటయ్యే ‘టోల్ పాస్’ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద తుది సమీక్షలో ఉంది.
*ఎలా పనిచేస్తుంది?
– కేవలం రూ.3000 చెల్లించి ఈ టోల్ పాస్‌ను పొందితే, జాతీయ రహదారులపై టోల్ గేట్‌ల వద్ద ఏవిధమైన అదనపు చార్జీలు లేకుండా ఏడాది పాటు ఎన్ని సార్లయినా ప్రయాణించవచ్చు.
– రూ.30,000 చెల్లిస్తే, ఏకంగా 15 సంవత్సరాల పాటు టోల్ చెల్లింపు నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రస్తుత టోల్ వ్యవస్థలో మార్పులు
ప్రస్తుతం, జాతీయ రహదారులపై రోజూ ప్రయాణించే వాహనదారులకు ఒక్కో టోల్ ప్లాజాకు మాత్రమే నెలవారీ పాస్‌లు జారీ చేస్తున్నారు.
– ఈ పాస్‌ల కోసం నెలకు రూ.340, అంటే ఏడాదికి రూ.4080 చెల్లించాలి.
– అయితే, కొత్త టోల్ పాస్ ద్వారా ఏ టోల్ గేట్ అయినా, దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు వీలుకలుగుతుంది.
మొత్తానికి, ఈ కొత్త టోల్ పాస్ విధానం అమలులోకి వస్తే, తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే కారు యజమానులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.