
TDP comes : ఏపీలో రాజకీయం ఎప్పుడూ కొంత గందరగోళంగానే ఉంటుంది. టీడీపీ, వైసీపీలు ఇక్కడ పోటాపోటీ రాజకీయాలు చేస్తుంటాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. చివరకు టీడీపీ కి పేరు వస్తుందని రాజధాని అమరావతి ప్రాజెక్టును కూడా పక్కన పెట్టింది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయించింది. ప్రజావేదికను కూల్చివేసింది. ఇలా ఇక్కడి రాజకీయాలన్నీ కక్షపూరితంగానే ఉంటాయి. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అమరావతికి మద్దతు తెలిపి, నేడు అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరోవైపు ఎన్టీఆర్ పేరిట ఉన్న పలు సంస్థలు, పథకాల పేర్లను మార్పు చేయించారు.
ఏపీలో ఇలాంటి రాజకీయం గతం నుంచి ఉన్నదే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమరావతి కోసం కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నది ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీకి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. టీడీపీ అధికారంలోకి వస్తే మరి పట్టాలను రద్దు చేస్తుందనే వాదన బయటకొచ్చింది.
టీడీపీకి అనుకూలంగా పని చేసే ఓ మీడియా చానల్లో ప్రముఖ జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలు కలకలం రేపింది. ఇప్పుడు వైసీపీ చేస్తున్నదే.. రేపు టీడీపీ చేస్తుందనేది సదరు జర్నలిస్ట్ వాదన. అయితే దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ లేదు. పేదలకు ఇచ్చే పట్టాలను తామెందుకు రద్దు చేస్తామని మాత్రం ఒకరిద్దరు నేతలు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ చర్చ అనవసరమని మరికొందరు మాట్లాడుతున్నారు. పేదలకు పట్టాల రద్దు అని మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని టీడీపీ అధినేతకు తెలుసు. ఇది సున్నితమైన అంశం కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడరు. దీనిని అనవరసంగా సదరు టీడీపీ అనుకూల మీడియా చానల్ లో ఏదో చెప్పేసి వివాదాస్పదం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇది టీడీపీ కి చేటు చేస్తుందని భావిస్తున్నారు పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం అంటే ఇక పతనం అంచునకు చేరినట్లేనని చెబుతున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు టీడీపీ నేతలు తిరస్కరిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండడంతో, ఇప్పుడు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారంతా భావిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పుడు ఇస్తేనే తమకు ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భావిస్తున్నది. ఏదేమైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడడం సరికాదని, ఇది వైసీపీకి మేలు చేసేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరి పట్టాల అంశంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.