
మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత సాధించాడు. భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు తో సత్కరించనుంది. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. కాగా ఆ వేడుకలలో మెగాస్టార్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ను ప్రకటించడంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ చరిత్రలో ఎన్నో అవార్డులు , రివార్డులు అన్నయ్య అందుకున్నాడని , అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ” ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్- 2022 ” మాత్రం ప్రతిష్టాత్మకమైంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసాడు.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకోవడమే కాకుండా సరికొత్త చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ , అక్కినేని , కృష్ణ , శోభన్ బాబు ల తర్వాత ఆ లెగసీని చిరంజీవి అందుకున్నాడు….. టాలీవుడ్ కు మరింత వేగాన్ని అందించాడు. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసాడు.