నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఓడించడానికి కేసీఆర్ , కేటీఆర్ బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. అవకాశం చిక్కితే చాలు కేసీఆర్ , కేటీఆర్ లతో పాటుగా మాజీ ఎంపీ కవిత మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు ధర్మపురి అరవింద్. దాంతో ఎలాగైనా సరే 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అతడ్ని ఓడించాలని కంకణం కట్టుకుంది గులాబీ దళం.
అందులో భాగంగానే అగ్ర నిర్మాత దిల్ రాజును నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా BRS తరుపున పోటీ చేయించాలని భావిస్తున్నారట. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి దిల్ రాజు అలియాస్ వెంకట రమణా రెడ్డి. గతకొంత కాలంగా దిల్ రాజుకు రాజకీయాల మీద గాలి మళ్లింది. సినిమారంగంలో అగ్ర నిర్మాతగా రారాజుగా వెలుగొందుతున్నాడు దిల్ రాజు.
ఇక ఇటీవల కాలంలో తన వారసులు నిర్మాతలుగా వస్తున్నారు. దాంతో ఆ బాధ్యతలను తన వారసులకు అప్పగించి తాను రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని దిల్ రాజు సన్నిహితులు అంటున్నారు. నిర్మాతగా దిల్ రాజుకు మంచి పేరుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేసాడు. దానికి తోడు సినిమా గ్లామర్ కూడా అదనపు ఆకర్షణ అవుతుందని కేటీఆర్ భావిస్తున్నాడట.
అందుకే ధర్మపురి అరవింద్ ను ఓడించడానికి దిల్ రాజును అతడి మీద పోటీకి నిలపాలని భావిస్తున్నాడట కేటీఆర్. BRS , కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో పాటుగా దిల్ రాజుకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ వెరసి ధర్మపురి అరవింద్ ను అవలీలగా ఓడించవచ్చని ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రాథమిక చర్చలు అయ్యాయని , అయితే ఎన్నికలు సమీపించిన తరుణంలో మాత్రమే దిల్ రాజు అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నట్లు సమాచారం.