19.8 C
India
Sunday, February 25, 2024
More

  Economic Status: మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు.

  Date:

   

  ఋణం..
  అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక ఛస్తున్నా! కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయ్ వెధవ కాకులు. అయినా మీఛాదస్తానికి వేగలేక ఛస్తున్నాననుకోండి. ఈకాలంలోకూడా ఏమిటీ నూనె ఆడించుకోవడాలు, నాఖర్మకాకపోతే? పెచ్చులు తీయడం, ముక్కలు కోయడం, ఎండబెట్టడం.. నావల్లకాదుబాబూ. గుళ్ళోకొట్టినవన్నీ తెచ్చి నా నెత్తినపాడేస్తారు. ఇకనుంచి నా వల్లకాదు.

  తెల్లవారుఝామున నాలుగింటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు పదకొండుగంటలకి ఇంటికొచ్చారు. ఆచమనంతప్ప పచ్చిమంచినీళ్ళుకూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక, స్తోత్రం, పూర్వపీఠిక, ఫలస్రుతి చెప్తేగాని ఆపదు.

  నాక్కాస్త ఫలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు ఆవూరి శివాలయం పూజారి శాస్త్రిగారు

  తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకెళ్ళి మంచమ్మీద వాలారో లేదో… గుప్పున కొట్టింది చేపల వాసన. లలితా! ఏమిటీవాసన? గదిలోంచే అరిచారు శాస్త్రిగారు. ఆకిటికీ తలుపు తెరచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే, సమాధానంగా.

  కిటికీ తలుపు తెరచిన శాస్త్రిగారు ఒక్కనిముషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకొచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటోచూడు అరుగుమీద ఏముందో…. దుంపతెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేసేటట్టున్నాయ్!” అనగానే….
  ఇంద ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధితలుపు తెరచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ. ఈసారి ఎవరిమీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతోంది. విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ…. చేపలగంప పెట్టుక్కూర్చుంది అరుగుమీద. ఇంకే అరుగు దొరకనట్టుంది. ఓ బకెట్టు నీళ్ళు పట్టుకెళ్ళి జల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరల కొబ్బరి ముక్కలదగ్గర స్టూలుమీద కూర్చున్నారు లలితమ్మ.

  వీధి అరుగు మీదికి నీళ్ళు పట్టుకెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది, లేచి నిలబడటానికి కూడా సత్తువలేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి, ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మా, ఒంట్లో బాలేదా? ఏమయ్యింది? అడిగారు శాస్త్రిగారు.

  అవును బాబయ్యా, జొరమొచ్చేసింది. గొంతెండిపోతుంది చాల నీరసంగా చెప్పింది ముసలమ్మ.

  సరే ఆగంప అలా సందులో పెట్టుకుని వచ్చి కుర్చో! ఈలోగ మంచినీళ్ళు తెస్తాను అని లోపలికెళ్ళి, నీళ్ళు, గోరువెచ్చని పాలు చెరో గాజు గ్లాసులోనూ పట్టుకొచ్చారు శాస్త్రిగారు. సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాణ్ణి పిలిచి పదిరూపాలిచ్చి కిరాణాకొట్టుకెళ్ళి ఒక రొట్టె తీసుకురమ్మన్నారు.

  ఇంద ఈ రొట్టెతిని పాలుతాగు. తరవాత ఈ బిళ్ళవేసుకుని అలా కాసేపు ఒరుగు. అదే సర్దుకుంటుంది అని ఒక క్రోసిన్ టేబ్లెట్ కూడా ఇచ్చారు.

  గంటతరవాత వచ్చిచూస్తే అమె అక్కడ లేదు. గంపతీసుకుని వెళ్ళిపోయింది.

  విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణకోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవొకటి. సాయంత్రం ప్రసాదంకోసం ఉంచిన పాలు అవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరిముక్కలు ఎండబెట్టుకోవడానికి వలనేయించమని ఏళ్ళుగా మొత్తుకుంటున్నా. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు. పదిరూపాయలిచ్చి రొట్టెకూడా కొనిచ్చేరంట. ఏంత ఉదారమో? వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పారు.

  పోన్లేవే జ్వరంతో ఉంది. పాలదేముంది.. ప్రెసిడెంటుగారికి కబురెట్టి ఒక లీటరు పాలు పంపించమంటే సరి. ప్రసాదానికే కదా. సర్దిచెప్పడానికి చెపుదామనుకున్నారు గాని, తనలో తానే అనుకోగలిగారు.

  నెలరోజులు గడిచాయి. సాయంత్రం అయిదింటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు శాస్త్రిగారు గుడితలుపులు తెరవడానికి. వీధి తలుపు తెరవగానే, గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగుమీద గంప పెట్టి ఉంది. కానీ వాసన రావట్లేదు. చక్కగా వుతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణంపెట్టింది, శాస్త్రిగారిని చూసి.

  ఏమ్మా ఇప్పుడెలాఉన్నావ్ అని అడిగారు శాస్త్రిగారు.

  బాగున్నాను బాబయ్య. ఆపదలో కాపాడేరు. మీరుణం తీర్చుకోలేను.

  ఏంపర్లేదమ్మా. నేనేంచేసాను. ఒక బిళ్ళ , కాసిని పాలు ఇచ్చాను అంతేకదా! వెళ్ళిరా! అని ముందుకి కదలబోయారు శాస్త్రిగారు.

  లేదుబాబయ్యా. ఇది మీకోసమే తెచ్చాను అంది గంపచూపిస్తూ.

  ఏముంది అందులో అడిగారు శాస్త్రిగారు.

  మాయింటికాడ కొబ్బిరి సెట్టుందండి. పదికాయలు దింపించి ఒలిపించాను. మా ఆయన మోకుతాళ్లు అల్లుతాడండి పదిగజాల తాడు అల్లించాను. గిలకబావి సేద క్కట్టుకోవచ్చండి. మరేమోనండి సిక్కం కూడా అల్లించేనండి.

  సిక్కమా, అదేంటి? అర్థంకాక అడిగారు శాస్త్రిగారు.

  వలండీ వల. ఏవన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసేత్తే ఇంక కాకుల గొడవుండదండి. ఇంకా చింతచిగురు, సీమసింతకాయలు కూడా వున్నాయండి. కొత్త గంపండి. సేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపలకట్టుకుపోండి. మీరు పంతులుగోరు కదండి బాబయ్యా. మడీ ఆశారం ఉంటాదని నేనే తానం సేసి కట్టేనండి అన్నీని. ఆయ్!

  గుక్కతిప్పుకోకుండా చేప్పేస్తుంటే.. నిశ్చేష్టులై వింటున్నారు శాస్త్రిగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండీ అంటూ ఉంటే… శాస్త్రిగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోటమాటలు రాలేదు.

  ఎల్లోత్తానండి పంతులుగోరు… దండాలండి అమ్మగోరు అని ఇద్దరికి దణ్ణాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొల సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు.

  వద్దు బాబయ్య. తమలాంటి దర్మ పెబువుల దగ్గర మేం పుచ్చుకోగూడదు. వత్తానండయ్యా అని మళ్ళీ దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది.

  ( *మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు )

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related