
వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా.. నీడగా.. ఆడిటర్ గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్ నమ్మినబంటుగా మారి ఆయనతోపాటు జైలు జీవితం గడిపారు. సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు.
అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను స్తుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు. వైసీపీ తరుఫన బలంగా కొట్లాడిన విజయసాయిరెడ్డి సడెన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిసృహలకు గురిచేస్తోంది.
2019లో చంద్రబాబు అధికారం కోల్పోయాక కేంద్రంలోని బీజేపీ అండ కోసం టీడీపీ రాజ్యసభ ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులను వారి భవిష్యత్తు కోసం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఇప్పుడు అదే పాలసీ కేసుల భయంతో జగన్ పార్టీ ఎంపీలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
విజయసాయిరెడ్డి ఏకంగా జగన్ కు, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక కేసుల భయం.. బీజేపీ అవసరం ఉందని అంటున్నారు. విజయసాయి రాజీనామా పార్టీ శ్రేణులకు షాక్ కలిగించింది. అయితే బీజేపీలో చేరి కేసులు మాఫీ చేసుకోవడం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన బీజేపీ తరుఫున 2025లో గవర్నర్ గా నామినేట్ కావడానికే ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మశక్యంగా లేదు. బీజేపీ ఆఫర్ ఇచ్చిందని గవర్నర్ గా వెళతారని మరికొందరు అంటున్నారు.
అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతును వినిపిస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి పయనం ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.






