పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో విజయవంతంగా రెండో టన్నెల్ను పూర్తి చేసిన ఎం ఈ ఐ ఎల్తొలి టన్నెల్ ను 2021 జనవరిలో పూర్తి చేసిన మేఘా సంస్థ వెలుగొండ (ప్రకాశం జిల్లా ) , జనవరి22, 2024:
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో మేఘా బ్రేక్ త్రూ మంగళవారం జరిగింది. దీనితో ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా పూర్తి అయినట్లే. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ టన్నెల్స్ తవ్వకం 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 2020లో తోలి టన్నెల్ లో 3. 6 కిలోమీటర్లు, రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల పనులు చేపట్టిన ఎం ఈ ఐ ఎల్ విజయవంతంగా వాటిని పూర్తి చేసింది. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన అధికారులు , కాంట్రాక్టు సంస్థ, సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. తొలి టన్నెల్ ను ఎం ఈ ఐ ఎల్ 2021 జనవరి నెలలో పూర్తి చేసింది. 13 నెలల్లోనే మూడున్న కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసి ఈ టన్నెల్ ను పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు ప్రారంభమైన 12 సంవత్సరాల తరువాత బ్రేక్ త్రూ ఐంది. రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల తవ్వకం పనులను టి బి ఎం ద్వారా ఎం ఈ ఐ ఎల్ మంగళవారం పూర్తి చేసింది.
ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను` ఆంధ్రప్రదేశ్ ప్రభుత్స్వంలోని జల వనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9 . 2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు. తోలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున్ రోజుకు ఒక టి ఎం సి నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు.
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండు టన్నెల్స్ పనులు ఎం ఈ ఐ ఎల్ చేపట్టింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని ఎం ఈ ఐ ఎల్ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది. ఆ తరువాత రెండో టన్నెల్ పనులు ప్రారంభించి ఈ రోజు బ్రేక్ త్రూ సాధించింది ఎం ఈ ఐ ఎల్. ఈ టన్నెల్స్ పూర్తి అయ్యి శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభము అయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3. 5 లక్షల ఎకరాలు, నెల్లూరు లో 80 వేల ఎకరాలు, కడప జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు వెలుగొండ ప్రాజెక్ట్ వల్ల లభిస్తుంది. ఈ మూడు జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు తాగు నీరు అందుతుంది.
వెలుగొండ టన్నెల్ లో ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగించారు. ఇది 39 మీటర్ల పొడవు ఉంది. టన్నెల్ తవ్వకం సమయంలో వచ్చే రాళ్లు, మట్టిని ఇది బయటకు తీసుకొస్తుంది. ఈ టన్నెల్స్ లో ఆడిటింగ్ లేకుండా పనులు పూర్తి చేశారు. ఏదైనా టన్నెల్ నిర్మించే సమయంలో ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ అంటే టన్నెల్ ఉపరితల భాగం నుంచి ఒక రంధ్రం చేసి దాని ద్వారా ఏవైనా అత్యవసర సమయాల్లో యంత్ర సామాగ్రి, వస్తువులు, కార్మికులను తరలించేందుకు ఉపయోగించే మార్గం. ఈ అవకాశం లేకపోవటం తో ఎం ఈ ఐ ఎల్ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ పనులు చేపట్టిన తరువాత అనేక అవాంతరాలు ఎదుర్కొంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనప సామగ్రి , యంత్రాలను కర్నూల్ జిల్లా సంగమేశ్వరం నుంచి 125, 800 టన్నుల బరువును మోయగలిగే రెండు పంట్ల ద్వారా కొల్లం వాగు వరకు తరలించి, అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి తరలించింది ఎం ఈ ఐ ఎల్ . పంటు ఈ సామాగ్రిని తరలించేందుకు పది గంటల సమయం పట్టేది. ప్రాజెక్ట్ లో పనిచేసే సిబ్బందిని శ్రీశైలం డ్యామ్ నుంచి స్పీడ్ బోట్స్ ద్వారా తరలించింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం నుంచి కార్మికులు సిబ్బందిని తీసుకురావాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. టన్నెల్ లోపల పనిచేసే కార్మికులు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ అంత వేడిని భరించాల్సి వచ్చేది. పనిచేసే కార్మికులు సిబ్బందికి అవసరమైన మంచినీటిని కూడా మరబోట్ల ద్వారా తరలంచాల్సిన క్లిష్టమైన పరిస్థితి నెలకొన్నా వాటన్నింటిని అధిగమించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఎం ఈ ఐ ఎల్ మేనేజర్ పీ. రాంబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పనులు జరిగే ప్రాంతం అభయారణ్యంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టకూడదు. ప్రతి రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోగానే పనులు చేపట్టాలి. ఆ తరువాత ఎలాంటి వాహన, యంత్ర కదలికలు ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్ అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆ నిబంధలు పాటిస్తూనే ఎం ఈ ఐ ఎల్ పనులు పూర్తి చేసింది. అదే సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలను ప్రభుత్వ సహకారంతో ఎం ఈ ఐ ఎల్ తీసుకుంది. పనులు జరిగేలా చూసింది. ప్రతి సంవత్సరం వచ్చే భారీ వర్షాలు, వరదల ప్రభావం కూడా పనులపై పడకుండా ఎం ఈ ఐ ఎల్ చర్యలు చేపట్టింది . ఇదిలా ఉంటె జలవనరుల శాఖ ఈ ఈ పురార్ధన రెడ్డి వెలుగొండ టన్నెల్ బ్రేక్ త్రూ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టతరమైన వెలుగొండ ప్రాజెక్ట్ పనులను ఇష్టంతో చేసి పూర్తి చేశామని అన్నారు. పులుల అభయారణ్యంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నా అన్ని నిబంధనలు పాటించి పనులు పూర్తి చేశామని, వచ్చే సీజన్లో నీటిని ఈ టన్నెల్స్ ద్వారా విడుదల చేస్తామని తెలిపారు.