
Naked worship : యువతులతో నగ్న పూజుల చేయిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ మండలం, పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వర్ రావు పూజలు చేస్తుంటాడు. చిలుకూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ పలు వ్యాపారాలు చేసి నష్టపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. డబ్బులు ఎలా సంపాదించాలా ? అనుకున్నారు. క్షుద్ర పూజలు చేస్తే గుప్త నిధులు బయట పడతాయని వాటితో మనం కోటీశ్వరులం కావచ్చని కలలు కన్నారు.
ఈ పూజలు నిర్వహించేందుకు యువతులు కావాలనుకున్నారు. వారికి బంప్ ఆఫర్ ఇచ్చారు. తాము చేసే క్షుద్ర పూజలో నగ్నంగా పాల్గొంటే లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. అందుకు యువతులను తీసుకురావాలని అరవిందతో కలిసి పూజారి నాగేశ్వర్ రావు నాగేంద్ర అనే వ్యక్తికి చెప్పారు. నాగేంద్రతో పాటు అతడి స్నేహితుడు సురేశ్ నంద్యాల జిల్లాలో పేద కుటుంబాలకు చెందిన యువతులను వెతకడం ప్రారంభించారు. దొరికిన వారికి రూ. లక్ష డబ్బు ఇస్తామని ఆశ చూపి ఒప్పించారు. ఒప్పుకున్న కొందరిని అరవింద వద్దకు తీసుకెళ్లారు నాగేంద్ర, అతని స్నేహితుడు. వారితో పూజలు పూర్తి చేశారు. ఆ తర్వాత వారిపై లైంగికదాడులకు పాల్పడ్డారు పూజారి, నాగేంద్ర, అతని స్నేహితుడు. దీంతో సదరు యువతులు ఎదురుతిరిగారు. వారిని కారులో ఎక్కించుకొని గుంటూరు వైపునకు తీసుకెళ్లారు. అయితే గోరంట్ల సమీపంలోకి వెళ్లగానే యువతులు ఎలాగోలా తప్పించుకొని ‘దిశ యాప్’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పూజారి, నాగేంద్ర, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసకుంటామని పోలీసులు చెప్పారు. యువతులు ఇలాంటి వారి మాయలో పడవద్దని సూచించారు. క్షుద్రపూజలు అంటూ ఎవరైనా వచ్చి డబ్బుల ఇస్తామని చెప్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. మోస పోతే జీవితంలో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.