
అల్లరి నరేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రవిబాబు సినిమా ‘అల్లరి’తో ఇండస్ట్రీలోకి వచ్చిన నరేశ్ అల్లరినే తన సర్ నేమ్ గా మార్చుకున్నాడు. తన తండ్రి ఈవీవీ ఫేమ్ వాడుకోకుండా సొంతంగా ఎదిగాడు. సీనియర్ నరేశ్ అప్పటి కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తే.. జూనియర్ నరేశ్ ఇప్పటి కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. కామెడీనే కాకుండా భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు నరేశ్. ‘మహర్షి’ సినిమాలో సైకో పాత్ర, శంభో శివ శంభో’లో చెవిటి వాడిలా.. ‘గమ్యం’లో మంచి ఫ్రెండ్ లా.. ‘నాంది’తో సిస్టం గురించి చెప్పిన నరేశ్ తర్వాత ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’తో పలకరించాడు. ఈ సినిమా అంతలా సక్సెక్ కాలేదు. దీని నుంచి బయట పడేందుకు ఇప్పుడు ‘ఉగ్రం’తో పలకరిస్తున్నాడు.
ఈ సినిమాలో అల్లరి నరేశ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రతో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా మీర్జా మీనన్ నటించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ‘షైన్ స్క్రీన్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సంగీతం శ్రీచరణ్ పాకాల సమకూరుస్తున్నారు. తూమ్ వెంకట్ కథకు, అబ్బూరి రవి మాటలు రాశారు. శుక్రవారం (మే 5)న ఈ సినిమా థియేటికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేశ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ఒక ప్రివ్యూషో వేశారు. ఈ నేపథ్యంలోనే మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.
చిత్ర విషయానికి వస్తే..
పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (అల్లరి నరేశ్) తన భార్యా పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. డ్యూటీలో భాగంగా ఆయన ఒక కేసును టేకప్ చేస్తాడు. వరుస కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఇందులో తన భార్యా, పిల్లలు కూడా ఉంటారు. అసలు ఎవ్వరు ఈ కిడ్నాప్ లకు కారణం.. వీరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇదే ఈ సినిమా కథ. ప్రివ్యూ చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు నరేశ్ అప్ కమింగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా నరేశ్ కెరీర్ ను మరో మలుపు తిప్పడం ఖాయమంటూ చెప్తున్నారు. ఏది ఏమైనా సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకుల నాడి తెలుస్తుంది. అప్పటి వరకూ వేచి చూడాల్సిందే..






