పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇక డాక్యుమెంట్ల వెరిఫికేషన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. డాక్యుమెంట్లను కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మొదట అప్ లోడ్ చేసి ఆ తర్వాతనే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రక్రియలో కొత్త నిబంధనలు ఆగస్టు 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై కొత్త పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడానికి డిజీలాకర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
డీజీ లాకర్ అనేది ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్, మార్క్ షీట్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం సిటిజన్ డిజీ లాకర్ డాక్యుమెంట్లను అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తర్వాతే.. passportindia.gov.in ద్వారా పాస్ పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయగలరు.
పీఎస్ కేల్లో ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో గుర్తించిన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ ప్రక్రియలో పుట్టిన తేదీ, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అనేక పొరపాట్లు కనిపిస్తున్నాయి. డిజీ లాకర్ ద్వారా డాక్యుమెంట్ల కచ్చితత్వం, ప్రామాణికతను నిర్ధారిస్తారు.
దరఖాస్తుదారుడు డిజీ లాకర్ లో డాక్యుమెంట్లను అప్ లోడ్ చేస్తే, దరఖాస్తు ప్రక్రియలో వారు వారి ఒరిజినల్ ఫిజికల్ డాక్యుమెంట్లను తీసుకురావాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్య పాస్ పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో సమర్థతను తీసుకువస్తుందని భావిస్తున్నారు.