No Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి విచారణ జరిపి కొట్టివేశారు.
ఈనెల 19న ఈ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాలవే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత నిన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చడం జరిగింది.
దీంతో మరో రెండు రోజులు చంద్రబాబు జైలులోనే ఉండాల్సి వస్తోంది. సీఐడీ బాబును ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించగా రెండు రోజులు అనుమతించింది. రాజమండ్రి జైలులోనే రెండు రోజులు విచారణ కొసాగించనున్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారనే వాదనలు టీడీపీ వర్గాల నుంచి వస్తోంది.
చంద్రబాబుకు మద్దతు కూడా పెరుగుతోంది. జగన్ పై విమర్శలు వస్తున్నాయి. నియంత పోకడలతో బాబును ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.