Sravana masam ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణం. శ్రావణ అంటే శుభకార్యాలు, వ్రతాలు, పూజలు గుర్తుకొస్తాయి. ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు అవుతుందంటే ఇళ్లతో పాటు వీధులు, ఆలయాల ఇలా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆధ్యాత్మికతతో నిండిపోతాయి. ఇండ్లన్నీ మామిడి తోరణాలు, పసుపు రాసిన గడపలతో ముస్తాబవుతాయి. గృహిణులు పూజలు, వ్రతాలతో చాలా బిజీగా ఉంటారు.
ఈ సంవత్సరంలో అదనంగా శ్రావణ మాసం వచ్చింది. దీన్ని అధిక శ్రావణ మాసం గా పిలుస్తారు. సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు మాత్రమే ఉంటాయి. కానీ తెలుగు మాసాల్లో మార్పులు వస్తాయి. ఇందులో భాగంగా ఈ సారి అధిక శ్రావణ మాసంతో కలిపి 13 నెలలు అన్నమాట. ఈ అధిక శ్రావణ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతంది. ఇక ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణ మాసం ఉంది. ఈ అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసంలో ముహూర్తాలు చూసి పెట్టుకొనే శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఉపనయనం, సీమంతం, భూమి పూజలు, శంకుస్థాపన, గృహ ప్రవేశం, కొత్త వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవం, వాస్తు పూజలు వంటివి చేయద్దని పండితులు చెప్తుంటారు.
కాని ఈ నెలలో తప్పనిసరిగా చేయాల్సిన పితృకార్యాలు మాత్రం చేయవచ్చని, ఆర్ధికం లాంటివి మానకుండా బ్రహ్మణుడికి సమర్పించవచ్చని పండితులు సూచిస్తున్నారు. అధిక మాసం కాబట్టి ఈ నెలలో చేసే ఏ పూజ అయినా అధిక ఫలితం లభిస్తుందని వేదాంతుల అభిప్రాయం. అందుకే ఆలయాలను ఇందుకు సిద్ధం చేశారు. గుడుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక మాసం అయినా భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు.