Pawan Kalyan: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ‘మహాయుతి’ గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గురించే అంతా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడిపోతే చెడిపోతాం అంటూ చంద్రబాబుకు చెప్పి చేతులు కలిపి, బీజేపీతో కూడా చంద్రబాబుకు దోస్తీ చేయించి మరీ కూటమి ప్రభుత్వం వచ్చేలా ప్రచారం చేశాడు.
ఆయన ‘వారాహి’ అధిరోహించినప్పటి నుంచి రాష్ట్రంతో పాటు దేశం యావత్తు ఆయన వైపునకే చూడడం ప్రారంభించింది. ఏపీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవర్ స్టార్ సనాతన వాదిగా కీర్తిని మూటగట్టుకున్నారు. లడ్డూ తయారీలో కల్తీపై నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన బాగోతాలను బయటపెట్టి సాక్షాత్తు శ్రీవారి చరణ సమీపంలో (తిరుపతి) భారీ బహిరంగ సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో ఆయన గురించి ప్రపంచం యావత్తు చర్చించుకోవడం మొదలు పెట్టింది.
ఇక రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం ఆకాంక్షించింది. దానికి తగ్గట్లుగా షెడ్యూల్ ఏర్పాటు చేసి మారీ టూర్లు నిర్వహించింది. ఆయన ప్రచారం చేసిన ప్రతీ చోట ‘మహాయుతి’ భారీ మెజార్టీతో గెలిచారు. ఆయా నియోజకవర్గాలే కాకుండా సమీపంలోని నియోజకవర్గాలు కూడా మరింత పుంజుకున్నాయి. మహారాష్ట్ర గెలుపులో ఉడతకంటే ఎక్కువ సాయమే పవన్ చేశారని బీజేపీ భావిస్తోంది.
ఇక, ఆయనను తమిళనాడుకు వినియోగించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే సనాతన ధర్మం విషయంలో తమిళ స్టార్లతో ఢీ అంటే ఢీ అంటూ దిగిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారానికి వెళ్తే ఎంతో కొంత కలిసి వస్తుందని ఎన్డీయే భావిస్తోంది. తప్పకుండా తమిళనాడుకు పవన్ కళ్యాణ్ ను అస్త్రంగా వాడుకుటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.