ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. షర్మిల తో పొంగులేటి భేటీ కావడంతో ఆ పార్టీలో చేరనున్నాడా ? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయం పై ఎవరూ స్పందించలేదు. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా చూపించదు అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను 10 గెలుచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు .
2014 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు గా విజయం సాధించాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గా కూడా పని చేసాడు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నాడు పొంగులేటి. అయితే తెలంగాణలో TRS కు తప్ప మరో పార్టీకి పుట్టగతులు లేవని భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి TRS లో చేరాడు. కానీ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అయినా ఇప్పటి వరకు గులాబీ పార్టీలోనే ఉన్నాడు. కానీ గత నాలుగేళ్లుగా పార్టీలో నాకు అవమానమే జరుగుతోందని , అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావించి పార్టీ మారడానికి సిద్ధమయ్యాడు. భారతీయ జనతా పార్టీలో చేరతాడాని అనుకున్నారు అంతా. అందుకు భిన్నంగా షర్మిల తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కావడంతో సంచలనంగా మారింది.