
Raitu Bandhu money : సాగు పెట్టబడి రైతుకు భారం కాకూడదని భావించిన కేసీఆర్ ‘రైతుబంధు’ తెచ్చారు. ఈ పథకం కింద ఎకరం నుంచి భూమి ఉన్న రైతులకు సాగు సాయం కింద రూ. 6000 రైతు బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఈ సాయం ఖరీఫ్ తో పాటు రబీకి కూడా ఉంటుంది. అంటే ఏడాదికి రెండు విడుతల్లో రైతుకు పంట సాయం అందుతుంది. దాదాపు 10 విడుతలను పూర్తి చేసుకున్న రైతు బంధు 11వ విడుత పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు (జూన్ 26) నుంచి రైతుల ఖాతాల్లో పంట సాయం జమ చేస్తుంది.
11వ విడుత రైతు బంధుకు సంబంధించి ఎకరం సాగు భూమి కలిగి రాష్ట్ర వ్యాప్తంగా 22,55,081 మంది రైతులు ఉండగా వారి ఖాతాల్లో విడుతల వారీగా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సారి 1.5 లక్షల మంది పోడు రైతులకు కూడా రైతు బంధు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోడు భూమి మొత్తం రూ. 1.54 కోట్ల ఎకరాలు ఉండగా పోడు రైతు ఖాతాల్లోకి రూ. 7720.29 కోట్లు జమ అవుతుందని మంత్రి వెల్లడించారు. ఈ సారి దాదాపు 5 లక్షల మంది కొత్త రైతులు ఈ పథకానికి అర్హులుగా అయ్యారు. అందులో 4 లక్షల మంది పోడు రైతులు ఉన్నారని అధికారులు చెప్తున్నారు.
పోడు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ. 300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావును, ముఖ్య కార్యదర్వి రామకృష్ణా రావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ నెల చివరి (జూన్ 30) నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. మొదటగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పట్టాల పంపిణీ చేయనున్నారు.






