Road Accident in Visakha : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులను తీసుకుని స్కూలుకు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. బెతనీ స్కూల్ లో చదువుతున్న చిన్నారులను తీసుకు వెళుతున్న ఆటోను సంగం – శరత్ థియేటర్ వద్ద ఒక లారీ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న చిన్నారులు చెల్లాచెదురుగా పడిపోయారు. పలువురు చిన్నారులు లారీ ఢీకొట్టిన వేగానికి రోడ్డుమీద పడడంతో తాలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆటోలో చిక్కుకున్న చిన్నారులను బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పోలీసుల సహాయంతో సెవెన్ హిల్స్ ఆసుపత్రికి చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన పలువురు చిన్నారుల రక్తం చిందడంతో ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పారిపోయేదుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల తలకు గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.