
Selling dog meat : తినే పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు కొందరు నీచులు. జింక మాంసం అంటూ కుక్క మాంసాన్ని విక్రయించిన ఘటన నిర్మాల్ లో జరిగింది. అయితే చుట్టూ అడవులు ఉండడంతో నిజంగా జింక మాంసమే అనుకొని కొనుగోలు చేసిన వారు చివరికి అది కుక్క మాంసం అని తెలియడంతో వైద్యుల వద్దకు పరుగులు తీశారు.
కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన ఆ నోటా.. ఈ నోటా.. సోషల్ మీడియాకు ఎక్కడంతో ఇప్పుడు వైరల్ గా మారింది. కుక్కను చంపి మాంసాన్ని జింక మాంసం అంటూ సీక్రెట్ గా విక్రయించారు. అటవీ జంతులవులను వేటాడడం నేరం. జరిమానాతో పాటు జైలు కూడా ఉంటుంది. ఇది తెలుసుకున్న కేటుగాళ్లు సీక్రెట్ గా అటవీ జంతువుల మాంసం వ్యాపారం చేస్తున్నారు. అయితే వారికి ఆ రోజు ఏ జంతువు ఉచ్చుకు చిక్కలేదు.
ఎలా అనుకున్నారో ఏమో..? ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నారు. మేక మాంసం అయితే గుర్తుపడతారు. అదే గొర్రె మాంసం అయితే తెలిసిపోతుందని భావించి. ఇంకేదైనా జంతువు మాంసాన్ని జింక మాంసంగా నమ్మించి అమ్మాలి అనుకున్నారు. కుక్క అయితే ఇందుకు సరిపోతుందనుకున్నారు. అది వీధి కుక్క అయితే దొరికిపోయే ఛాన్స్ ఉంటుందని, పెంపుడు కుక్క అయితే మంచిదని భావించారు.
పొట్టెపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరుణ్ పెంపుడు కుక్కకోసం వేట మొదలు పెట్టారు. ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కపై వారి కన్ను పడింది. దీంతో ఎలాగోలా దొంగిలించారు. గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు. పథకం ప్రకారం సమీప గ్రామాల్లో జింక మాంసం అంటూ అమ్మారు. చుట్టూ అడవులు కాబట్టి నిజమే అనుకొని చాలా మంది కొనుగోలు చేశారు. అయితే, కుక్క యజమాని ఆనంద్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సీసీ కెమెరాను పరిశీలించారు. శ్రీనివాస్, వరుణ్ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే ఈ మాంసం తిన్న వారందరూ భయాందోళనలో ఉన్నారు.






