Superstar Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ (73) చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోమవారం (సెప్టెంబర్ 30) అర్ధరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రజనీకాంత్ ను చేర్పించారు. ప్రస్తుతం రజనీకాంత్ కు వైద్యులు చికిత్స అందించారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రజనీ ప్రస్తుతం వేట్టయాన్, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది.
రజనీకాంత్ కు మంగళవారం (అక్టోబర్ 1) ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంపై అటు రజనీకాంత్ కుటుంబం నుంచి కానీ, ఇటు ఆసుపత్రి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రజనీకాంత్ హాస్పిటల్ లో చేరారనే వార్తలు వెలువడడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.