
Supreme shock : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. తనను సీబీఐ అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని అవినాష్ రెడ్డి వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు జేకే అనిరుధ్, జస్టిస్ సంజయ్ తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ముందుగా మెన్షనింగ్ జాబితాలో లేనందున విచారణ సాధ్యం కాదని పేర్కొంది. అయితే మంగళవారం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాగా, ఎంపీ అవినాష్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ప్రతిసారి ఆయనకు చుక్కెదురవుతున్నది.
అయితే కర్నూల్లో మాత్రం అవినాష్ అరెస్టుకు సంబంధించి, సీబీఐ వేగం పెంచినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సహకరించనుందన, కేంద్ర బలగాల సాయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తున్నది. మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కేంద్ర బలగాలు కర్నూల్ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం కర్నూల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అరెస్ట్ ను అడ్డుకోవడానికి అవినాష్ అనుచరులు ప్రయత్నిస్తారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు బలగాల రాకకోసం వేచిచూస్తున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధులపై అవినాష్ దాడిని మీడియా సంఘాలు ఖండించాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
కర్నూల్ లోని ఓ గెస్ట్ హౌస్ లో సీబీఐ టీమ్ ఎదురుచూస్తున్నది. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే తక్షణ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ర్టంలో సీబీఐని అడ్డుకుంటున్న అంశం సంచలనంగా మారింది. రాష్ర్టం అసాంఘిక శక్తుల చేతుల్లో ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏకంగా ఎస్పీ నే చేతులెత్తేయడం వివాదాస్పదంగా మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున కేంద్ర బలగాల రాక కోసం సీబీఐ టీమ్ ఎదురుచూస్తున్నది. సాయంత్రానికల్లా అవినాష్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.