
Krishna Ella and Suchitra : మనకు కరోనా పెద్ద గుణపాఠమే నేర్పింది. అంతవరకు లేని అలవాట్లు అన్ని మనం పాటించాలి. శానిటైజర్ వాడటం, మాస్క్ ధరించడం, క్యూ పద్ధతి పాటించడం ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకున్నాం. కరోనా ఉగ్రరూపాన్ని మెడలు వంచిన ఘనత మనదే కావడం గమనార్హం. మనం తయారు చేసిన టీకాలతో కరోనా కనిపించకుండా పోయింది. కరోనా రక్కసిని తుదముట్టించడంలో టీకా ప్రాధాన్యం పెరిగింది.
టీకా తయారీలో డాక్టర్ కృష్ణ ఎల్ల పాత్ర గురించి తెలిసిందే. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కృష్ణ, ఆయన సతీమణి సుచిత్ర దంపతులకు 2023 తానా జీవిత సాఫల్య పురస్కారం అందజేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై ఓటింగ్ కూడా జరిగింది. అందరు ఆమోదం తెలపడంతో వారికి ఈ అవార్డు అందజేయనున్నట్లు సమాచారం.
తమిళనాడులోని తిరుత్తణిలో తెలుగు కుటుంబంలో జన్మించిన కృష్ణ బెంగుళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. తరువాత హవాయి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. విస్కాన్సిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పొందారు. ఇలా ఆయన తన కెరీర్ లో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు.
బాయర్ సంస్థ వ్యవసాయ విభాగంలో పనిచేశారు. ఆ ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్లారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారత్ కు తిరిగి వచ్చి భారత్ బయోటెక్ ను స్థాపించారు. ఈనేపథ్యంలో కరోనా టీకా అభివృద్ధి చేసి ప్రపంచానికే సవాలు విసిరారు మన టీకా చాలా దేశాలు వాడుకుని కరోనా నుంచి లబ్ధి పొందాయి. అందుకే వీరికి తానా పురస్కారం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.