
రాష్ట్రంలో ఇంకో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు మొదలుకానుండడంతో నాయకుల కప్పగెంతులు ప్రారంభమవుతున్నాయి. ‘ఏ పార్టీలోకి వెళ్తే గెలుస్తాం.. దేని హవా ఉంది.. ఏ పార్టీ తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది’ అంటూ ఒక్కో నేతకు ఒక్కో ఈక్వేషన్ కామనే. తెలంగాణ బీజేపీలో ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఇటీవల లీకులు వస్తున్నాయి. అధికారికంగా వారు ప్రకటించకపోయినా ఆయా నేతల మాటలు చూస్తేంటే నిజమనే సందేహాలు మాత్రం కలుగక మానడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంతో పాటు విడిపోయిన తర్వాత కూడా అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలో బీజేపీ వెనకే ఉండిపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు అనే ఊహ కనీసం పార్టీలో ఉన్న కేడర్ కూడా రావడం లేదు. తెలంగాణలో ఈ మధ్యే ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నా.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో మళ్లీ చతికిల పడే ఛాన్స్ కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. బయటకు ఒక్క స్టేటే కదా అంటూనే లోలోన అంతర్మధనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల్లో కూడా కలవరం మొదలైంది.
‘పార్టీలోకి వస్తే కలిసి పనిచేద్దాం’ అంటూ రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులకు పదే పదే చెప్తున్నారు. కర్ణాటక ఊపుతో తెలంగాణలో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ వైపు వెళ్లాలా అని కొందరు సీనియర్ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీలో వ్యక్తి పూజ అస్సలు ఉండదు. దీనికి తోడు పార్టీ జెండాను మోసే కార్యకర్తకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలో చేరి సినియర్ నేతలు వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి లాంటి సినియర్ చరిష్మా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న లీకులు వినవస్తున్నాయి.
ఇక ఈ మధ్య బహిషృత నేతలు పొంగులేటి, జూపల్లి మొన్నటి వరకూ బీజేపీ వైపు చూశారు. కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ వైపు వెళ్లాలని అనుకుంటున్నారు. వీరు మాత్రమే కాకుండా మిగతా బీజేపీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్నకొందరు నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే.. మళ్లీ అటువైపు వెళ్తే.. అనుచరులకు ఏం చెప్పుకోవాలి. ఓటర్లకు ఏ విధమైన సందేశం వెళ్తుంది అనే దానిపై తర్జన భర్జన అవుతున్నట్లు వినికిడి. ఏది ఏమైనా కొందరు నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.