- నేడు ప్రకటన, 20న ప్రమాణస్వీకారం

Politics of Karnataka : కర్ణాటక సీఎం పీఠం పీటముడి వీడింది. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు రోజల ఉత్కంఠకు తెరిదించుతూ మరికొన్ని గంటల్లోనే కీలక ప్రకటన వెలువడనుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరూ పట్టువీడక పోవడంతో హైకమాండ్ తీవ్రం ఆందోళనలోకి వెళ్లింది.
అయితే పార్టీ అధిష్టానం బుధవారం అర్ధరాత్రి వరకు ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపింది. సిద్ధరామయ్య, డీకేలకు చెరి రెండున్నరేళ్లు అధికారం పంచేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటించనున్నారు. అయితే ఈనెల 20న కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఈరోజు సిద్ధరామయ్య, డీకేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తున్నది. గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా వీరిద్దరూ కలుసుకోలేదు. సిద్ధ రామయ్య పేరు ఖరారైందని, ఆయనకు ప్రోటోకాల్ కూడా ఇచ్చారని బుధవారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని వదంతులేనని పార్టీ అధిష్ఠానం కొట్టి పడేసింది.
కాగా, బెంగళూరులో ఈ రోజు ఎమ్మెల్యేలతో ఏఐసీసీ నాయకులు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలు, ప్రభుత్వం ఏర్పాటు పై చర్చించనున్నారు. ఆరు రోజుల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుండగా, అధిష్టానం మంత్రి వర్గం వివరాలపై కూడా కసరత్తు చేస్తున్నది. డీకే శివకుమార్ ను ఈ మేరకు ఒప్పించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. రాహుల్ గాంధీ కూడా డీకే, సిద్ధరామయ్యలతో పలు మార్లు చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటన కోసం కర్ణాటక ఎదురు చూస్తున్నది.