Capital from Dussehra : జగన్ ప్రభుత్వం తను అనుకున్నది సాధించుకుంటుంది. మూడు రాజధానుల అంశం మొదలైనప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు, వివాదాలు, నిరసనలు, రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు నిర్వహించినా వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే. ఏది ఏమైనా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో దీనికి కసరత్తు కూడా చేయడం మొదలు పెట్టింది. ఇందులో మొదటిది పరిపాలనా రాజధాని విశాఖపట్నం.
పరిపాలనా రాజధాని విశాఖపట్నంను దసరా నుంచి ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధాని ప్రారంభం కోసం విజయ దశమి రోజు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రోజు (సెప్టెంబర్ 20) భేటీ అయిన కేబినేట్ ఈ మేకరకు తీర్మానించింది. ఇప్పటికే సాగర తీరాన సీఎం నివాసం, పలు కార్యాలయాల నిర్మాణాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. రాజధాని అంశంలో కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది.
చంద్రబాబు నాయుడి అరెస్ట్, కొత్త రాజధాని అంశంతో ఇలా వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా విశాఖపట్నం దసరా నుంచి అందుబాటులోకి తేవాలని జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.