Atul Kumar: ఒక యువకుడి కథ ఆ గ్రామాన్నే కన్నీరు పెట్టించింది. చదువు కోసం ఆ యువకుడు తపించిన తీరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ను సైతం కదిలించింది. న్యాయస్థానం పరంగా చేయాల్సింది తప్పకుండా చేస్తామని స్వయంగా చంద్రచూడ్ హామీ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ గా మారింది. అసలు కథ ఏంటంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ టిటిరో గ్రామానికి చెందిన దళిత యువకుడు ఐఐటీ ధన్‌బాద్‌లో ప్రవేశం పొందాడు. అయితే అంగీకార రుసుముగా రూ. 17,500 డిపాజిట్ చేయాలి. దాని గడువు జూన్ 24కు ముగిసింది. దీంతో ఆయన ఆర్థిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. అతుల్ కుమార్ తల్లిదండ్రులు పేదవారు వారికి నలుగురు కొడుకులు. అతుల్ తండ్రి రాజేంద్ర ప్రసాద్, తల్లి రాజేశ్ దేవి. తండ్రి ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. తల్లి ఉపాధి వర్కర్ ఇద్దరూ కలిసి కొడుకులను ఉన్నతంగా చదివించాలనుకున్నారు. వారి ఆశయాలను కూడా కొడుకులు నెరవేరుస్తున్నారు. 24 ఏళ్ల మోహిత్ ఎన్‌ఐటీ హమీర్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేయగా, 23 ఏళ్ల రోహిత్ ఐఐటీ-ఖరగ్‌పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడో కొడుకు అమిత్ విదేశాల్లో చదవాలనే కలలతో కాలేజీలో రాణిస్తున్నాడు.
అతుల్ కుమార్ ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించాడు. అతని కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో ఉండడంతో గ్రామస్తులు కూడా తలో చేయి వేశారు. అయితే, అతుల్ IIT ధన్‌బాద్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయగలిగినప్పటికీ, వెబ్‌సైట్ అతనిని 4:56 గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేసింది, 5 గంటల గడువుకు కొద్ది నిమిషాల ముందు, ఫీజు చెల్లింపును పూర్తి చేయకుండా నిరోధించింది.
అతుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మొదట్లో, అతను జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు ఆ కోర్టు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయమని సలహా ఇచ్చింది. అయితే, మద్రాస్ హైకోర్టులో విచారణ అనంతరం, ప్రతివాది వల్ల ఆలస్యం కావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ఆయన న్యాయవాది సూచించారు. దీంతో అతుల్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.
సెప్టెంబర్ 24న జరిగిన విచారణలో, ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దళిత యువకుడికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ‘మేము మీకు వీలైనంత వరకు సహాయం చేస్తాము. అయితే జూన్ 24తో ఫీజు డిపాజిట్ గడువు ముగియడంతో మూడు నెలలుగా మీరు ఏమి చేస్తున్నారు’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 30 సోమవారంకు వాయిదా వేసింది.
ఖతౌలీలోని హై స్కూల్, శిశు శిక్షా నికేతన్‌లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత, అతుల్ కాన్పూర్‌లోని గెహ్లాట్ సూపర్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో IIT ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యాడు. IIT ధన్‌బాద్‌లో సీటు సంపాదించాడు.