Tomato Beat Petrol Price : మనదేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందనే సంగతి తెల్సిందే. అయితే సామాన్యుడికి చౌక ధరలో లభించే టమాట మాత్రం ఇప్పుడు పెట్రోల్ ధరను బీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా టమాట ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. కిలో టమాట ఏకంగా సెంచరీని దాటేసింది. దీంతో టమాటను కొనుగోలు చేయాలంటేనే సామాన్య.. మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
పెట్రోల్ ను బీట్ చేసిన టమాట..
మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం కనిష్టంగా 90 నుంచి గరిష్టంగా 130 వరకు ఉంటుంది. ఆయా నగరాలను బట్టి పెట్రోల్ ధరలు మారుతున్నాయి. పెట్రోల్ ధర మాదిరిగానే టమాట కూరగాయలు సైతం సెంచరీ మార్కుకు అటు ఇటుగా ఉన్నాయి. మాములుగా టమాట ధరలు కిలోకు ఒక రూపాయి నుంచి 30 వరకు మాత్రం ఉండేవి. అయితే ఇటీవల దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో టమాట దిగుబడి భారీగా పడిపోయింది. ఈక్రమంలోనే కొద్దిరోజులుగా టమాట ధరలు క్రమంగా పెరుగుతూ సెంచరీ మార్కును దాటేశాయి.
పెట్రోల్ తో ఢీ అంటే ఢీ అంటున్న టమాట..
టమాట ధరలు పెట్రోల్ ధరలతో పోటీ పడుతున్నాయి. ప్రజలు టమాట ధరలను పెట్రోల్ తో పోల్చి చూస్తున్నారు. చాలాచోట్ల కిలో టమాటకు లీటర్ పెట్రోల్ ధర సమానంగా ఉండటం గమనార్హం. శ్రీనగర్లో టమాట(కిలో) రూ.50 ఉండగా పెట్రోల్(లీటర్) రూ.101.32గా ఉంది. జలంధర్లో టమాట 95 ఉండగా పెట్రోల్ రూ.97.99గా.. ఢిల్లీలో టమాట రూ.120 ఉండగా పెట్రోల్ రూ.96.76 గా ఉంది. జైపూర్లో టమాట రూ.100 ఉండగా పెట్రోల్ రూ.108గా ఉంది. లక్నోలో టమాట రూ.146 ఉండగా పెట్రోల్ రూ96.55గా ఉంది.
ముంబైలో టమాట రూ.108 ఉండగా పెట్రోల్ రూ.106.29గా ఉంది. పనాజీలో టమాట రూ.110 ఉండగా పెట్రోల్ రూ.97.66, బెంగుళూరులో టమాట రూ.90 ఉండగా పెట్రోల్ రూ.101.92, తిరువనంతపురం రూ.130 ఉండగా పెట్రోల్ రూ.109.71.. సిమ్లాలో టమాట రూ.93 ఉండగా పెట్రోల్ రూ.97.25 గా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాలను పరిశీలిస్తే టమాట ధరలు ఇంచుమించుగా పెట్రోల్ ధరలతో సమానంగా లేదంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్..
ఈక్రమంలోనే పెరుగుతున్న ధరలపై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ వీపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే టమాట ధరలు మాత్రం సామాన్యుడికి కన్నీళ్లను మిగిలిస్తుండటం బాధకరంగా మారింది.