Tomato Crime : గత కొద్దిరోజులుగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు చికెన్ రేటుకు తలపిస్తోంది. దీంతో టమాటా ప్రియులు లబోదిబోమంటున్నారు. రుచి కోసమో లేదంటే పులుపు కోసమే ప్రతీ వంటలో టమాను వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ప్రస్తుతం టమాటా ధరలు కిలో 100కు చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
టమాటా ధరలు పెరిగిపోవడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్.. జోక్స్ పేలుతున్నాయి. ప్రస్తుతం టమాటా కాస్లీ గిప్ట్ గాను మారిపోయింది. దీంతో కొత్తగా పెళ్లయిన జంటలకు టమాటాలను గిప్టుగా ఇస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు సైతం టమాటాలను చోరీలకు పాల్పడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దొంగలు అంటే ఓ బ్యాంకుకో కన్నం వేయడమో.. లేదంటే ఏ ఇంట్లోనే చొరబడి నగలు.. బంగారం దోచుకెళుతుంటారు. అయితే టమాటా ధరలు పెరగడంతో కొందరు చోరశిఖామణులు వాటిని టార్గెట్ చేస్తున్నారు. కర్ణాటకలోని హళేబీడు ప్రాంతంలో ఓ రైతు పొలంలో దొంగలు చొరబడి నిల్వచేసిన 90బాక్సుల టమాటాలను ఎత్తుకెళ్లారు.
వీటి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.2.7లక్షలు కావడం గమనార్హం. ఈ సంఘటన రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టమాటా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.