
YS Avinash arrested : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ కర్నూలు పట్టణం చేరుకున్నట్లు సమాచారం. దీంతో కర్నూల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. అరెస్ట్ ను అడ్డుకోవడానికి అవినాష్ అనుచరులు ప్రయత్నిస్తారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎంపీ అవినాష్ అరెస్టుకు అవకాశం ఉందనే వార్తలు వ్యాపించడంతో, వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బెయిల్ కోసం సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. సీబీఐ కేంద్ర ప్రధాన కార్యాలయం కూడా దీనిపై దృష్టి సారించింది.
అవినాష్ తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేరారు.
హత్యకేసులో విచారణ నిమిత్తం ఈరోజు తమ ఎదుట హాజరుకావాలని సమన్లను తిరస్కరిస్తూ ఆదివారం సాయంత్రం అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరో ఐదు రోజులు సమయం కావాలని కోరాడు అయితే సీబీఐ ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.ఈరోజు తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసేందుకు కర్నూలుకు చేరుకున్నారు. అరెస్ట్‌పై సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీకి,స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అరెస్టు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని గతంలోనే సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. అయితే మరోసారి అవినాష్ సుప్రీం మెట్లెక్కారు. దీనిని వ్యతిరేకించేందుకు వివేకానందరెడ్డి కూతురు సునీత తరపు లాయర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేంతవరకూ తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ కోరుతున్నట్లు తెలుస్తున్నది.