
A couple : ఒకే ఊరికి చెందిన ఇద్దరు దగ్గరి బంధువులు ఒక్కటి కావాలని ప్రేమించుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఒకే గదిలో ఇద్దరు వేర్వేరు పద్ధతుల్లో సూసైడ్ చేసుకున్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ఏడో ఫేజ్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, వారిద్దరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే..
భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన ఆకుల శ్యాం (24), పోతుల జ్యోతి (22) బంధువులు. బంధుత్వం, మనసులు కూడా కలవడంతో ప్రేమించుకున్నారు. శ్యాం బైబిల్ బోధనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే జ్యోతి గత నెల 26వ తేదీ కూకట్ పల్లికి వచ్చి ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది. అయితే జ్యోతికి గతంలో వివాహం కావడంతో భర్త వేధింపులకు గురిచేయడంతో డైవర్స్ తీసుకుంది. నగరానికి వచ్చి ఉద్యోగం చేసుకుంటుంది.
వారి ఊరికే చెందిన కృష్ణ ఏల్ఐజీ-8లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. తన బంధువుల పెళ్లి 20వ తేదీ ఉండడంతో 9వ తేదీనే కృష్ణ ఊరికి వెళ్లాడు. అతనితో పాటు అతని గదిలో ఉంటున్న స్నేహితుడు కూడా ఊరెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తన గది తాళం చెవులు కావాలని శ్యాం కృష్ణకు ఫోన్ చేసి అడిగాడు. తాళం చెవులు ఉన్న అడ్రస్ చెప్పాడు కృష్ణ. దీంతో ఈ నెల 12వ తేదీన జ్యోతిని తీసుకొని ఆ గదికి వెళ్లాడు శ్యాం. అయితే వీరిద్దరూ చాలా సార్లు ఇలాగే వస్తుంటారని స్థానికులు కూడా పోలీసులకు తెలిపారు.
జ్యోతి కోసం ఆమె స్నేహితులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. అయితే సోమవారం కృష్ణ గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి చూడగా జ్యోతి కింద అచేతనంగా పడి ఉంది. పక్కనే శ్యాం ఊరేసుకుని కనిపించాడు. వారి ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా గది ఓనర్ కృష్ణ, జ్యోతి బంధువులు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు.
గదిలో స్లీపింగ్ పిల్స్ కు సంబంధించి స్ట్రిప్ కూడా కనిపించడంతో బహూషా జ్యోతి నిద్రమాత్రలు వేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారా..? లేక ఇద్దరి మధ్యా ఏదైనా వివాదం తలెత్తడంతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ పోర్టం కోసం ఉస్మానియాకు తరలించారు.