- కాబోయే భర్తను అరెస్ట్ చేయించి సంచలనం

Lady Singham : అస్సాంలో టెరిఫిక్ ఆఫీసర్ గా పేరున్న జున్మోని రభా మృతి చెందారు. ఆమెకు ఆ రాష్ర్టంలో లేడీ సింగంగా పేరుంది. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి , ఆమె దేశ వ్యాప్తంగా సంచలనమయ్యారు. ఎంతో సాహసోపేత అధికారిగా ఆమెకు పేరుంది. రోడ్డు ప్రమాదమే ఆమెను బలి తీసుకున్నట్లుగా సమాచారం.
అసలేం జరిగిందంటే..
అస్సాంలోని నాగోవ్ జిల్లా కాలియాబోర్ సబ్ డివిజన్లోని ఓ గ్రామం వద్ద ఈ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు ఈ ఘటనను గుర్తించారు. వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఈ విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ లేకుండా ఆమె బయటకు వెళ్లడం, బయటకు ఒంటరిగా ఎందుకు వెళ్లిందో తమకు కూడా సమాచారం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ధైర్యశాలిగా పేరు
జున్మోని రభాకు ఎంతో ధైర్యశాలిగా పేరుంది. గతంలో ఎన్నో వివాదస్పద కేసులను ఢీల్ చేశారు. అవినీతి విషయంలో ఉక్కుపాదం మోపేవారని తెలిసింది. తనకు కాబోయే భర్త ఉద్యోగాల పేరిట పలువురిని మోసగించాడని తెలిసి, అతడిని కూడా అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే అవే అవినీతి ఆరోపణలతో ఆమె గతేడాది సస్పెండయ్యారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.