- నాటి మరణహోమానికి కీలకం అతనేనా..

Most Wanted : 26/11.. ముంబై మారణహోమం.. గుర్తుకు వస్తేనే ప్రతి భారతీయుడి గుండెల్లో ఓ రకమైన కదలికలు వస్తాయి. 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన మన భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఉగ్రవాదం అంతం చేయాల్సిందేననే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది. అర్ధరాత్రి నగరం నిద్రపోతున్న వేళ కొంత మంది దుండగుల దురాగతం మరికొన్ని రోజుల పాటు నిద్ర పోవాలంటేనే ముంబై ప్రజలను వణికించింది. ఒళ్లు గగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటనకు సూత్రధారి త్వరలో ఇండియాకు వస్తున్నాడని వార్తలు అందుతున్నాయి. ఇంతకి ఎందుకు.. ఎలా.. వస్తున్నాడంటే..
అప్పగించేందుకు రెడీ..
వచ్చే నెలలో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. నాటి ముంబై మారణహోమానికి సూత్రధారిని ఇండియాకు అప్పగించాలనే భారత్ డిమాండ్ కు ఆమోదం తెలిపింది. కీలక సూత్రధారి, నిందితుడైన తహవూర్ రాణాను అప్పగించేందుకు కాలిఫోర్నియా కోర్టు సమ్మతం తెలిపింది. రెండు దేశాల మధ్య నేరస్థుల ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. పాకిస్థాన్ కు చెందిన ఈ తహవూర్ రాణా నాటి ఘటనకు ఆర్థికంగా సహకరించినట్లు సమాచారం.
నాటి ఘటన అనంతరం మన ఎన్ఐఏ విచారణలో ఆ అంశం తేలింది. అయితే అప్పటి నుంచి ఆయన అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఆయన ను అక్కడ అరెస్ట్ చేశారు. నిరూపితం కావడం తో షికాగో న్యాయస్థానం ఆయనకు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆయనను తమకు అప్పగించాలని భారత్ కొన్ని రోజులుగా కోరుతూ వస్తున్నది. ప్రస్తుతం కాలిఫోర్నియా కోర్టుకు ఇందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రాణాను ఇండియాకు తెచ్చేందుకు మార్గం సుగుమమైంది.