garlic paste : ఆహారం అమృతం కావాలి కానీ రోజు రోజుకు విషంగా మారుతోంది. కొందరు చేస్తున్న కల్తీతో బయటి ఆహారం, ఆహార పదార్థాలంటేనే ఆందోళన పెరుగుతోంది. బయటి ఫుడ్ సేఫ్టీ కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ ఇటీవల ఇంట్లో ఫుడ్ కు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఇంట్లో పండించేవి కాకుండా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునే వాటిలో కూడా భయంకరమైన కల్తీ ఉంటుంది. గతంలో కల్తీకి ఇప్పటి కల్తీకి చాలా తేడాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటేనే వామ్మో అనాల్సిందే.
గతంలో కల్తీ ఆరోగ్యాన్ని నాశనం చేసేలా ఉండేది కాదు. ఉదాహరణకు కొందరు వ్యాపారులు బియ్యంలో కొన్ని చిన్న చిన్న రాళ్లు వేసి కల్తీ చేసేవారు. తూకం ఎక్కువగా వచ్చేది. అయితే చెరిగేప్పుడు, కడిగేప్పుడు జాగ్రత్త పడితే ఆందోళన ఉండదు. ఇంకా కారంపొడిలో ఆరోగ్యానికి పెద్దగా హానీ చేయని రంగులను కలిపేవారు, పసుపులో కూడా. కానీ అసలు వస్తువే లేని దాన్ని క్రియేట్ చేయడం ఎంత పెద్ద ఘోరం.
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్’ తయారీ సంస్థలో యాసిడ్లను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు.ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు. యజమాని షఖీల్ అహ్మద్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అల్లంకు బదులు సిట్రిక్ యాసిడ్ ను ఉపయోగించి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మహ్మద్ షఖీల్ అహ్మద్ తో పాటు మరో 8 మందిని ఫుడ్ సేఫ్టీ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.