
Bridegroom : పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ ఇక్కడే జరుగుతాయి. తనకు కాబోయే వరుడిని అమ్మాయి, వధువును అబ్బాయి ఎంచుకోవడం సహజం. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ తీరా సమయానికి వరుడు చెక్కేయాలని అనుకున్నాడు. దీంతో కల్యాణ మండపానికి రాకుండా తప్పించుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు.
పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. తాళి కట్టేందుకు వరుడు రావాలి. కానీ ఫోన్ చేస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. దీంతో వధువు ఏమనుకుందో ఏమో గానీ వరుడిని వెతికేందుకు తానే స్వయంగా బయలుదేరింది. బరేలికి సమీపంలో వరుడు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది.
వరుడు కావాలనే పెళ్లికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని ఆమె చూపిన తెగువ అందరిలో ఆశ్చర్యం నింపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పెళ్లిపీటల మీద కూర్చోవడానికి వరుడు ఎందుకు ముఖం చాటేశాడు. పైగా ఇద్దరు ప్రేమించుకున్నారు. మనసులు ఏనాడో కలిశాయి.
పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన అతడిని ఆమె ధైర్యంతో పట్టుకుని మండపం వద్దకు తీసుకురావడం సంచలనంగా మారింది. సాధారణంగా ఆడవారు పారిపోతే మగవారు వెతుకుతారు. కానీ ఇక్కడ విరుద్ధంగా వరుడు పారిపోతే వధువు వెతికి తీసుకురావడం గమనార్హం.