crime రాత్రి ప్రయాణాలు ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో.. అర్ధరాత్రి బస్సు సాగర్ కాలువలోకి దూసుకెల్లింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు ఉన్నాడు. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
వీరంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ వేడుకకు హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అయితే దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. ఈ ప్రమాదంతో పెళ్లింట విషాదం అలుముకుంది.
మృతులు పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60),షేక్ రమీజా (48),ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం(65),షేక్ షబీనా(35),షేక్ హీనా(6)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఒంగోలు హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ మలికా గార్గ్ పరిశీలించారు. మృతురాలు షేక్ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కాకినాడకు రైళ్లో బయల్దేరి వెళ్లడంతో ప్రమాదం తప్పింది.
ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
రాత్రివేళ ప్రయాణాల.. ప్రమాదాలు
రాత్రివేళ ప్రయాణాల్లోనే దాదాపు ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై స్ట్రీట్ లైట్లు సరిగా వెలగకపోవడం, క్రాసింగ్ లైన్స్ సరిగా కనిపించకపోవడం, రోడ్లపైకి ఇసుక వస్తుండడం, ఇరుకు రోడ్లు ఇలా పలు రకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.