
Reels : ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. గులాబీ జెండాలే… అంటూ రామక్క పాట.. కాస్త కిందకు స్క్రోల్ చేస్తే, మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ మరో గీతం.. మరి కాస్త కిందకు పోతే.. సాలు దొర, సెలవు దొర అంటూ ప్రకటనలు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీలు తెగ ఊదరగొట్టేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రచారం హద్దులు దాటింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పొటాపోటీగా ప్రచారం జరిగింది. బహిరంగ సభలలోనో.. ప్రచార ర్యాలీలో కంటే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరిగాయి. ‘గులాబీల జెండలే రామక్క’ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ పాట ద్వారా.. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను, అభివృద్ది కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. ‘మన అన్న కేసీఆర్ రామక్క.. ఏమి పనులు చేసెనే రామక్క’ ‘సావు నోట్ల తల పెట్టి రామక్క.. ఢిల్లి మెడలు వంచినాడు రామక్క’ అంటూ జనాల్లో హోరెత్తించారు. కేవలం లిరిక్స్ తో మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీల చేత కూడా డ్యాన్స్ లు వేయించి పాపులారిటీ దక్కించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేస్తుందని భావించారు కానీ కాంగ్రెస్ హస్తం దెబ్బకు బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం అయింది.
ఈ పాటకు ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూ యెన్సర్లతో డ్యాన్సులు చేయించిన సంగతి తెలిసిందే. వీళ్లెవరూ పార్టీ కోసం డ్యాన్సులు చేయలేదట. ఒక్కొక్కరు 30సెకన్ల పాటు డ్యాన్స్ చేస్తే లక్ష రూపాయలు చెల్లించారట. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ కొణతం దిలీప్ ఐ అండ్ పీఆర్ నుంచి రూ.15కోట్లను వీళ్ల కోసం పంపిణీ చేశారట. సర్కార్ సొమ్మును యూట్యూబర్స్ కు చెల్లించి బీఆర్ఎస్ తన పార్టీ కోసం ప్రచారం చేయించుకోవడం తెలిసి జనాలు అవాక్కవుతున్నారు.