సినిమాల వినూత్న పబ్లిసిటీ గురించి ఈరోజుల్లో మాట్లాడుకుంటున్నారు కానీ ….. 87 ఏళ్ల క్రితమే సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కింది. అందునా తెలుగు సినిమాకు ఘనమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. తాము నిర్మించిన సినిమాలను ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లడానికి రకరకాల ప్రయోగాలు చేశారు దర్శక నిర్మాతలు.
అలా వినూత్నంగా ఆలోచించి విమానం నుండి అలాగే హెలికాప్టర్ నుండి కరపత్రాలను జారవిడిచి తమ సినిమాల ప్రమోషన్ లను 87 ఏళ్ల కిందటే చేశారు. అప్పట్లో అదొక సంచలనం. ఇలా ఆకాశ మార్గంలో ప్రచారం చేసిన చిత్రాల్లో 1967 లో వచ్చిన రహస్యం , 1972 లో వచ్చిన పాపం పసివాడు చిత్రాలు ప్రముఖమైనవి. పాపం పసివాడు చిత్ర విషయానికి వస్తే…… ప్రభంజనంగా మారింది. ఓ పసివాడు ఎడారిలో చిక్కుకుపోవడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది.
అయితే ఈ చిత్రాల కంటే ముందుగానే మరో సినిమా ఇలా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలను పంచిన సినిమా శ్రీకృష్ణ లీలలు. 1935 లో ఈ సినిమా విడుదల కాగా ఆ సినిమా ప్రచారం కోసం ఇలా హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేయించారు. ఇంతటి సాహసానికి , వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పివి దాసు. సాహసం సేయరా డింబకా అన్నట్లుగా ధైర్యే సాహసే లక్ష్మీ అన్నట్లుగా మదరాసులో తెలుగు సినిమాకు అంకురార్పణ చేసిన మహనీయుడు. అంతకుముందు వరకు కూడా సినిమాల నిర్మాణం కలకత్తా , కొల్హా పూర్ , బొంబాయి లలో మాత్రమే నిర్మాణం అవుతుందేవి.
మదరాసు లో చిత్ర నిర్మాణానికి పూనుకొని బి.ఎన్. రెడ్డి, కే.వీ. రెడ్డి వంటి దిగ్గజాలు దర్శకులుగా ఓనమాలు నేర్చుకోవడానికి కారకుడైన రాంనాథ్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది పీవీ దాసు గారు కావడం విశేషం. సాలూరి రాజేశ్వర్ రావు ను బాల నటుడిగా పరిచయం చేసింది , గాలి పెంచల నరసింహారావు ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది పి.వి. దాసు గారు కావడం గమనార్హం. మొట్ట మొదటి మాయాబజార్ చిత్ర దర్శకుడు కూడా పి. వి. దాసు గారు కావడం విశేషం.