
Pawan Kalyan : ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తాజాగా డిప్యూటీ సీఎం పదవితో పాటు ఇంకా పంచాయతీ రాజ్, నీటి సరఫరా,పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఐదు పదవులు అప్పజెప్పారు. ఇలాంటి తరుణంలో పవన్ ఇక నుంచి సినిమాలకు పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో పవన్ గెలవడంతో పాటు కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దీంతో ఆయన పూర్తి రాజకీయాలకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రిగా ఐదు శాఖల బాధ్యతలను చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా సినిమా షూటింగ్స్ అంటే కుదరని పని. అందుకే ఇక మీదట పవన్ సినిమాలు చేసే అవకాశాలు చాలా తక్కువ.
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉండగా.. సురేందర్ రెడ్డితో ఓ సినిమా ప్రకటించారు. హరీష్ శంకర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఓజీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎలక్షన్స్ హడావిడి లేకుంటే ఈ పాటికి రిలీజ్ కూడా చేసేవారు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో షూటింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండిపోయింది. అటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలది అదే పరిస్థితి. దీంతో పవన్ కళ్యాణ్ కు ఇవే చివరి సినిమాలు కానున్నాయనే టాక్ వినపడుతోంది.